నాగార్జునసాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి 4లక్షల 79 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... అధికారులు 20 క్రస్ట్ గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తి... స్పిల్ వే ద్వారా 4లక్షల 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగుల కాగా... గరిష్ఠానికి నీరు చేరుకుంది.
సాగర్లో గరిష్ఠ స్థాయి నీటిమట్టం... 20 గేట్లు ఎత్తివేత - నాగార్జున సాగర్ వార్తలు
నాగార్జునసాగర్ 'నిండు'కుండలా మారింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. నీటి ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతుండగా... ప్రాజెక్టులోని 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
312.04 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ పూర్తి స్థాయి నీరు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమకాలువల ద్వారా 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 28 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి మొత్తం ఔట్ ఫ్లో గా 4లక్షల 79 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది.
సాగర్ జలాశయం మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉండగా... ప్రస్తుతం 20 మాత్రమే ఎత్తి నీటి ప్రవాహాన్ని దిగువన ఉన్న పులిచిoతలకు విడుదల చేస్తున్నారు. ఇంకా వరద ఉద్ధృతి కొనసాగితే మిగతా క్రస్ట్ గేట్లను సైతం ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సాగర్ జలాశయం ఈ మాసంలో 11వ తేదీ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం వల్ల గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు.