Dengue Fevers in Nalgonda : నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెంలో కొంతకాలంగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు విషజ్వరాలతో బాధపడుతున్నారు. వారంతా నల్గొండకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. మాములు జ్వరమని సమీపంలోని మిర్యాలగూడ, నల్గొండలోని ఆసుపత్రులకు వెళ్తే డెంగీ వచ్చిందని వైద్యులు నిర్ధారిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వేలకువేలు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఇంటిల్లిపాదికీ జ్వరం సోకడంతో లక్షకు పైగా ఖర్చుచేసి ఆర్థికంగా చతికిలపడ్డారు.
పంచాయతీ పట్టించుకోలే...!
గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోకపోవడంతో విషజ్వరాలు సోకుతున్నాయని వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో ఇదేపంచాయతీ ఆవాసమైన నూకలవారి గూడెంలోనూ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదైనా... గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య బృందం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారిదేనని సర్పంచ్ చెబుతున్నారు.