నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు. తిరుమలగిరి మండలం తెట్టేకుంట, ఆల్వాల గ్రామాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రచారం చేశారు. గత పాలకులు పదవులు అనుభవిస్తూ అభివృద్ధి చేయడం మర్చిపోతే.. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న గులాబీ పార్టీ వెంటే ప్రజలున్నారని స్పష్టం చేశారు.
తెరాస కుటుంబ పార్టీ..
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుముల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. మరోసారి తెరాస ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తోందని విమర్శించారు. సాగర్ ఉపఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు నాగార్జునసాగర్-హైదరాబాద్ మార్గంలో పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. హాలియాలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేశారు. అంతకుముందు త్రిపురారం మండల కేంద్రంతోపాటు.. పెద్దదేవులపల్లి, బావుసాయిపేటలో కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెరాస అంటే కుటుంబ పార్టీ అని, కేసీఆర్ సర్కారు అంటేనే ఒకే ఇంటి పాలన అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసినా వ్యర్థమేనని తెలిపారు.