నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు... రెండు ప్రధాన పార్టీలు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాయి. సీనియర్ నేతల్లో ఇద్దరు, ముగ్గురికి కలిపి ఒక్కో మండలం చొప్పున బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానాలు... ఓటర్లను ఆకర్షించటంపై దృష్టి సారించాయి. మండలాలకు కేటాయించిన ఇంఛార్జులంతా... తమ ప్రాంతం నుంచి కేడర్‌ను తెచ్చుకున్నారు. అందులో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పురపాలికల కౌన్సిలర్లతో పాటు... క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలు... తమ కేడర్‌ను కులాల వారీగా విభజించారు. ఏ సామాజిక వర్గం వారికి... ఆ సామాజిక వర్గ ఓటర్లను కలుసుకునే పని అప్పజెప్పారు.
సాగర్‌లో ప్రత్యేక వ్యూహం... సామాజికవర్గాల వారిగా పార్టీల ప్రచారం - నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు... వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఏ ఒక్క వర్గం ఓట్లు కూడా తమకు దూరం కావొద్దన్న ఉద్దేశంతో... ఆయా సామాజిక వర్గాలకు చెందిన శ్రేణుల్ని రంగంలోకి దింపాయి. ఇక మండలాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు తమ కేడర్‌ను వెంటబెట్టుకుని... అందులోని వ్యక్తుల కులాల ఆధారంగా, వారిని కలుసుకునే బాధ్యతలు అప్పజెప్పారు.
కలగూర గంపగా అందర్నీ అన్ని చోట్లకు పంపితే ఫలితం లేదని భావించిన ప్రధాన పార్టీ... కులాల ఆధారంగా ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులకే బాధ్యతలు అప్పజెప్పుతున్నాయి. తిరుమలగిరి సాగర్ మండలంలో... గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉంది. తండాల్లోకి వెళ్లి ప్రచారం చేయాలంటే... వారి భాష తెలియడమే కాకుండా వారితో సులువుగా మమేకమవుతూ ఉండాలి. అలా చేయాలంటే గిరిజన జాతికి చెందిన వ్యక్తులనే అక్కడకి పంపించాలి. ఇదే సూత్రాన్ని సదరు ప్రధాన పార్టీలు అవలంబిస్తున్నాయి. తమ నియోజకవర్గాలు వదిలి గత నెల రోజుల నుంచి మండలాల్లోనే ఉంటున్న ఇంఛార్జులు... వారం నుంచి సామాజికవర్గం ఆధారంగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ప్రాంతాలతో సంబంధమే లేకుండా...
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 36 వేలకు పైగా... గిరిజనులు 34 వేలకు పైగా... రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 23 వేలకు పైచిలుకు... ఎస్సీ కులాలకు సంబంధించి 35 వేల దాకా ఓట్లున్నాయి. సెగ్మెంట్లోని మొత్తం ఓట్లలో... ఈ నాలుగు సామాజికవర్గాలకు చెందిన ఓట్లే 58 శాతానికి పైగా ఉన్నాయి. ఈ వర్గాల్ని లక్ష్యంగా చేసుకున్న పార్టీలు... ఆయా వర్గాలకు చెందిన నాయకుల్ని ఇంటింటికీ తిప్పుతున్నాయి. ఒక కులానికి చెందిన వ్యక్తుల్ని ఆకర్షించడంలో అదే కులానికి చెందిన నాయకులకు పెద్ద కష్టం కాబోదని భావిస్తున్న పార్టీలు... ప్రాంతాలతో సంబంధం లేకుండా కేవలం సామాజికవర్గాలపైనే ఆధారపడి ఓట్ల వేట సాగిస్తున్నాయి.