నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి రోజు 15న లేదా 14న నియోజకవర్గంలో కేసీఆర్ సభ ఉండనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10న ఉమ్మడి ‘నల్గొండ జిల్లా కృతజ్ఞత సభ’ను హాలియాలో నిర్వహించారు. ఈ సభను కూడా హాలియాలో నిర్వహించాలా లేదా ఇతర ప్రాంతంలోనా అన్న దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
మంత్రి కేటీఆర్ రోడ్‌షో
మరోవైపు మంత్రి కేటీఆర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్‌షో ఉండనుంది. తొలుత ఈ నెల 6 తర్వాత తొలి దశ రోడ్‌షో ఉండనుండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశలో మరోసారి ఉంటుందని తెలిసింది.