రవాణా శాఖ అధికారులు, పోలీసులతో దౌర్జన్యంగా లారీలను తీసుకెళ్తే ఊరుకునేది లేదని రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా హెచ్చరించారు. ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడానికి యజమానుల అనుమతిలేకుండానే వాహనాలను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్ సప్లై అధికారులు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తరలించడాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు.
'లారీలను బలవంతంగా తీసుకెళ్తే నిరవధిక బంద్'
ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడానికి లారీ యజమానుల అనుమతిలేకుండా అధికారులు వాహనాలను బలవంతంగా తీసుకెళ్తున్నారని రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా ఆరోపించారు. ఇలాంటి చర్యలను వెంటనే ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
లారీలు లేకుండా తక్కువ కొటేషన్ ఉన్నవారికి ధాన్యం తరలింపును కేటాయించడంతో ఇక్కడ సమస్య ఏర్పడిందన్నారు. కాంట్రాక్టర్లు ధాన్యాన్ని తరలించడానికి సరైన సంఖ్యలో లారీలను సప్లై చేయలేక అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు, సివిల్ సప్లై, రవాణా శాఖ అధికారులు, పోలీసులతో కుమ్మకై రోడ్లపైన ఖాళీగా వెళ్తున్న లారీలను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కిరాయి కొద్ది మొత్తంలోనే డబ్బులు ఇస్తున్నారని.. దీంతో లారీ యజమానులు నష్టాల పాలవుతున్నారన్నారు. ధాన్యం తరలించే కాంట్రాక్టర్లు లారీ అసోసియేషన్లతో మాట్లాడి నిర్ణయించిన ధరకు ఎన్ని లారీలైనా పంపడానికి సిద్ధంగా ఉన్నామని చాంద్ పాషా తెలిపారు.
ధాన్యం తీసుకెళ్లిన లారీలు మిల్లుల వద్ద మూడు, నాలుగు రోజులు ఉండాల్సి వస్తుందని దీనివల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఇకనైనా అధికారులు ఆలోచించి ఇలాంటి చర్యలు మానుకోవాలని లేని పక్షంలో లారీలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.