మే ఆరోతేదీ నుంచి 14వ తేదీ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రూ.126 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. గతేడాది ఇదే మే ఆరో తేదీ నుంచి 14వ తేదీకి రూ.73 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే గతేడాది కంటే రూ.52 కోట్లు అధికమన్నమాట. సాధారణ రోజుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలు తెరచినా ఇంత అమ్మకాలు జరిగేవి కాదని, ఇప్పుడు సాయంత్రం 6 వరకే పరిమితులు ఉన్నా ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయని అబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు.
మద్యం ధర పెంచినా.. తెగ తాగేశారు.. - more liquor sales in nalgonda
కరోనా దెబ్బతో 45 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు తెరచిన మొదటిరోజే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రూ.16.5 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. విరామం తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో మద్యంప్రియులు ఎండనూ లెక్కచేయలేదు.
మద్యం దుకాణాలను మూసేస్తే ఎలా అన్న ఆలోచనతో మద్యం ప్రియులు భారీగా నిల్వ ఉంచుకున్నారు. మొదటిరోజు కొద్ది దుకాణాల్లోమాత్రమే మనిషికి రెండు బాటిళ్ల లెక్క పరిమితులు పెట్టిన అబ్కారీ శాఖ.. ఆ తర్వాత అపరిమితంగా మద్యం ఇచ్చేశారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే ఈ తొమ్మిదిరోజుల్లో రూ.50 కోట్ల అమ్మకాలు జరిగాయి. లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడం, మందును నియంత్రించాలనుకోవడంతో ఈసారి మద్యం ధరలను 16 శాతానికి పెంచారు. అయినా సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్ సడలింపుల తర్వాతే అబ్కారీ శాఖకు ఎక్కువగా ఆదాయం లభించింది.