Lemon Prices: మండుతున్న ఎండల్లో కాసింత నిమ్మరసం తాగి సేద తీరాలనుకోవడమూ ఖరీదైన వ్యవహారంగా మారింది. రాష్ట్రంలో నిమ్మకాయలకు తీవ్ర కొరత ఏర్పడటమే ఇందుకు కారణం. గతేడాది కన్నా పంట దిగుబడి సగానికి పైగా తగ్గిపోగా.. ధర మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం టోకు మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది. గతేడాది ఇదే సమయంలో రూ.3 వేలలోపే ఉండేది. చిల్లర మార్కెట్లో కిలో రూ.140 నుంచి రూ.160లకు అమ్ముతున్నారు. విడిగా అయితే రూ.10కి 2 కాయలకు మించి ఇవ్వడం లేదు. దీంతో వినియోగదారులు కొనలేకపోతుండగా.. తమకూ ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.
అధిక వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట..రాష్ట్రంలో నిమ్మకాయల సాధారణ సాగు విస్తీర్ణం 45 వేల ఎకరాలు కాగా.. ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో సాగవుతోంది. గత అక్టోబరు నుంచి జనవరి వరకూ కురిసిన అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో పాటు తెగుళ్లు, అధిక తేమతో పూత, కాత సరిగా రాలేదు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 90 శాతం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే సాగవుతుంది. తామర పురుగు, ఇతర తెగుళ్లతో ఈ రెండు జిల్లాల్లో నిమ్మ చెట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని నల్గొండ జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు తెలిపారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని నిమ్మకాయల మార్కెట్‌కు గతేడాది(2021) ఏప్రిల్‌లో రోజూ 7 నుంచి 8 వేల బస్తాల దాకా రాగా.. ప్రస్తుతం 1500-2500 బస్తాలే వస్తున్నాయి.