కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు గొడ్డలి పెట్టులాంటివని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని.. ఇప్పటి వరకు ఏ రైతూ తమ పంటను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్న దాఖలాలు లేవని గుత్తా స్పష్టం చేశారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ మొదలైన రాష్ట్రాల్లో ఎంత పంట పండినా ఎకరం పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. మన రాష్ట్రంలో మాత్రం రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కేంద్రం చెబుతున్న మాదిరిగా రైతులు దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చంటే.. మన రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడతారని.. ఇతర రాష్ట్రాల పంటలు మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోలేమని అన్నారు.