తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2022, 3:31 PM IST

Updated : Mar 20, 2022, 7:09 PM IST

ETV Bharat / state

Mallu Swarajyam: అశ్రునయనాల మధ్య అరుణతారకు తుది వీడ్కోలు

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు.. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపై పలువురు రాజకీయవేత్తలు, పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం నల్గొండలోని జిల్లా సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్రగా భౌతికకాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించారు.

Mallu Swarajyam: అరుణతార అంతిమ చూపు కోసం పోటెత్తిన జనం..
Mallu Swarajyam: అరుణతార అంతిమ చూపు కోసం పోటెత్తిన జనం..

అశ్రునయనాల మధ్య అరుణతారకు తుది వీడ్కోలు

Mallu Swarajyam: అభిమానులు, కమ్యూనిస్టులు, బంధువుల అశ్రునయనాల మధ్య కామ్రేడ్​ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ముగిసింది. తెలంగాణ ఉక్కు మహిళ.. తుపాకీ చేతబట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన పోరాట ధీరురాలు మల్లు స్వరాజ్యం పార్ధివదేహానికి పలువురు నివాళులర్పించారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి కలిగించిందని ఓ ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. ఎంతోమంది నేతలు, కార్యకర్తలకు మల్లు స్వరాజ్యం స్ఫూరిగా నిలిచారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మల్లు స్వరాజ్యం త్యాగాలు, పోరాటాలను వామపక్ష నేతలు గుర్తు చేసుకున్నారు. తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ కవిత ఇతర నేతలు మల్లు స్వరాజ్యం పోరాటాలను గుర్తుచేసుకున్నారు.
స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్న నేతలు

అనంతరం స్వరాజ్యం పార్థీవ దేహాన్ని వామపక్ష శ్రేణుల నినాదాల నడుమ నల్గొండకు తరలించారు. అక్కడ సీపీఎం పార్టీ కార్యాలయంలో సందర్శనార్థం ఉంచారు. కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. పార్ధివదేహానికి మంత్రి జగదీష్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి,రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి, కమ్యునిస్టు నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, మధు, జూలకంటి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా తెరాస ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని నేతలు గుర్తుచేసుకున్నారు.

ప్రజా ఉద్యమాలకు తీరని లోటు..

ఆమె లేని లోటు తీర్చలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండలో మల్లు స్వరాజ్యం పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. మల్లు స్వరాజ్యం సంతాప సభలో ఆమె మృతి పట్ల మంత్రి విచారం వ్యక్తంచేశారు. ఆమె మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. చివరి క్షణం వరకు సిద్దాంతాల విషయంలో రాజీ పడని యోధురాలని ఆయన కొనియాడారు. పీడిత ప్రజల విముక్తి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు ఆమెకు ఊపిరి అన్న మంత్రి.. సమాజ మార్పు కోసం జరిగే ఉద్యమాల్లో మహిళలకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

నివాళులర్పించిన కొత్తగూడెం గ్రామస్థులు

తెలంగాణ రైతాంగసాయుధ పోరాట వీరనారి మల్లుస్వరాజ్యం స్వగ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామస్థులు నివాళులర్పించారు. కొత్తగూడెం నుంచే పోరుబాట పట్టిన మల్లుస్వరాజ్యం ఇక తిరిగిరారనే వార్తను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని దుఃఖం ఆపుకోలేకపోయారు. తమలో ఎంతో విప్లవస్ఫూర్తిని రగిలించిన అరుణతార అంటూ విలపించారు. ఆమె ఆశయసాధనలో నడుస్తామని వారు నినాదాలు చేశారు.

ఆమె చివరి కోరిక ప్రకారం..

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు.. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర అభిమానులు, కమ్యూనిస్టులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిసింది. పార్టీ కార్యాలయం నుంచి వైద్యకళాశాల వరకు నిర్వహించిన అంతిమయాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. స్వరాజ్యం భౌతికకాయాన్ని ఆమె చివరి కోరిక ప్రకారం నల్గొండ వైద్యకళాశాలకు అప్పగించారు. దిల్లీలోనూ మల్లు స్వరాజ్యానికి వామపక్ష నేతలు నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:

మల్లు స్వరాజ్యంకు ప్రముఖుల నివాళి.. నల్గొండకు భౌతికకాయం తరలింపు

Last Updated : Mar 20, 2022, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details