Munugode Bypoll Campaign:మునుగోడు ఎన్నికలకు ప్రచార గడువు సమీపిస్తుండటంతో రాజకీయపక్షాలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యనేతల పర్యటనలు, రోడ్‌షో, బహిరంగసభల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అధికార తెరాస అభివృద్ధిని ప్రస్తావిస్తుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఊరూరా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
ప్రచారంలో తెరాస: రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే మునుగోడులో ఉపఎన్నిక వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. చండూరు మున్సిపాలిటి మూడో వార్డులో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. నాంపల్లిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు అభివృద్ధి తెరాసతో సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. చండూరు, మర్రిగూడలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వ్యక్తులు పార్టీని వీడితే నష్టం లేదని.. తెరాస బలమైన పార్టీ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.