Munugode Bypoll Campaign:రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విస్తృత ప్రచారాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని ప్రధాన నేతలను పార్టీలోకి ఆకర్షించేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మకాం వేసి.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ప్రచారంలో తెరాస:తెరాస అభ్యర్థికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేశారు. మునుగోడు అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని ఆయన అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటింటి ప్రచారం చేశారు. మంత్రికి బోనాలు, బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు. భాజపా ఇచ్చే ప్యాకేజీ కోసమే రాజగోపాల్ పార్టీ మారారు తప్పా నియోజకవర్గ ప్రజలకోసం కాదని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు.
ప్రచారంలో భాజపా:ఉపఎన్నికలో తనకు ఓటు వేసి భాజపాను గెలిపించాలంటూ చండూరులో ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. స్థానిక మహిళలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. రాజగోపాల్‌రెడ్డి ప్రచారం చేసే సమయంలో ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. మర్యాదపూర్వకంగా పలకరించుకున్న నేతలు శుభాకాంక్షలు చెప్పుకుని వెళ్లిపోయారు.
రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మునుగోడు మంటలం కిష్టాపురంలో పర్యటించారు. అక్కడి ప్రజల్ని కలుసుకున్న కిషన్‌రెడ్డి భాజపాకు ఓటు వేసి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ దేశాన్ని దోచుకునేందుకు తెరాసను భారాసగా మార్చారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా నాంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా సర్కార్ వస్తుందన్న లక్ష్మణ్ మునుగోడు గెలుపుతో నాంది పలకాలని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు రేపటి నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్డు షోలతో పాటు సమావేశాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.