Lakh Jalaharati Program Wonder World Record : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం చెరువుల పండగను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఆయా గ్రామాల ప్రజలు కన్నులపండువగా జరుపుకున్నారు. ఆ జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాళేశ్వరం జలాలను మొదటగా జిల్లాకు అందించినందుకుగానుముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా అక్కడ ఎస్సారెస్పీ కాలువపై లక్ష జనహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతంలో 68 కిలో మీటర్ల పొడవులో 2.45 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ఎస్సారెస్పీ కాలువలోని కాళేశ్వరం జలాలకు ప్రజలు హారతినిచ్చారు. ఈ కార్యక్రమం వండర్ వరల్డ్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు వండర్ వరల్డ్ బుక్ ప్రతినిధులు మంత్రి జగదీశ్‌రెడ్డికి సన్మానించారు.
ఈ సందర్భంగా చివ్వెంల ప్రాంతంలో లక్ష జనహారతి కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి రైతులతో కలిసి గోదారమ్మకు చీర, సారె, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. ఎడారిగా ఉన్న సూర్యాపేట ప్రాంతానికి మొదటగా కాళేశ్వరం జలాలు అందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా లక్ష జనహారతి ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 126 గ్రామాల పరిధిలోని ప్రజలు కాళేశ్వరం జలాలు పారుతున్న కాల్వల కట్టలపై చేరుకొని, హారతి ఇచ్చి, పూలు జల్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపారు. ఇందుకుగాను అధికారులు కాలువ పొడవునా భారీ ఏర్పాట్లు చేశారు.