నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంనకు చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తన త్రీ వీలర్ పైనుంచి కిందపడి తలకు తీవ్రగాయమై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమంలో అంశాల స్వామి పాల్గొన్నారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ అనగానే తక్షణమే గుర్తుకొచ్చిన మరో పేరు అంశాల స్వామి అని సీఎం గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ రహిత శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి, ప్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని ముఖ్యమంత్రి తెలిపారు.
అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. స్వామితో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన కేటీఆర్.. ఫ్లోరోసిస్ సమస్యపై స్వామి అవిశ్రాంతంగా పోరాడారని గుర్తు చేశారు. స్వామి మృతి పట్ల ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్ సంతాపం వ్యక్తం చేశారు.