KTR Review Joint Nalgonda District: మునుగోడులో గెలిపించిన నెలరోజుల్లోనే ఐదుగురు మంత్రులం మునుగోడుకు వచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. రాబోయే 6 నెలల్లో రూ.1544 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. తండాల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్లు బాగు చేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో రూ.175 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై మునుగోడులో ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. చండూరు మున్సిపాలిటికీ రూ.50కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.30కోట్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త 5 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని ప్రకటించారు. నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం:మునుగోడు నియోజకవర్గంలో బొమ్మల తయారీ పరిశ్రమ నెలకొల్పుతామని కేటీఆర్ చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు తెరాస వశమయ్యాయని అన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ను చాలా గొప్పగా ఆదరించారని తెలిపారు. జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.