KTR on bjp government: ఐఐటీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జాతీయ భాష అంటూ ఏదీ లేదని.. చాలా అధికారిక భాషల్లాగే హిందీ సైతం ఓ అధికారిక భాషేనని కేటీఆర్ పేర్కొన్నారు. భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉండాలన్నారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను దేశం మొత్తానికి ఆపాదించాలనుకోవటం ఎంతవరకు సబబు?: కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ప్రజలపై హిందీ భాషను రుద్దాలనుకుంటోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ రాసినట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు గల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న హోంమంత్రి అమిత్షా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ అన్ అఫీషియల్ లాంగ్వేజెస్ నివేదికను మంత్రి తప్పుబట్టారు. కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను దేశం మొత్తానికి ఆపాదించాలనుకోవటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదన్న మంత్రి.. ప్రపంచ స్థాయి సంస్థలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, మల్టీనేషనల్ కంపెనీల్లో మన యువత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదవడమే కారణమన్నారు. మోదీ సర్కారు హిందీ భాషకు అనవసర ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తోందని విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను కచ్చితం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.
రాజ్యాంగ హక్కుని కాలరాస్తున్నారు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలు హిందీ మీడియంలో ఉండటాన్ని సైతం మంత్రి తప్పుబట్టారు. కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందని తెలిపారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఇంగ్లీష్, హిందీలకే ప్రాధాన్యత ఇచ్చి తన చిత్తశుద్దిలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.