కొన్నిరోజులుగా కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదలతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 550 అడుగులు దాటింది. జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రాజెక్టు అధికారులు సన్నాహాలు చేశారు. పెద్దఅడిశర్లపల్లిలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) పుట్టంగండి ఎత్తిపోతల నుంచి నాలుగు మోటార్లను ప్రారంభించి 2,200 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి జలాశయానికి విడుదల చేస్తున్నారు. అక్కంపల్లి జలాశయం నుంచి జులై 25 నుంచి ఉదయసముద్రానికి 858 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో పెండ్లిపాకల మిషన్ భగీరథ ప్లాంటుకు డిస్ట్రిబ్యూటరీ - 7 ద్వారా 120, జంటనగరాల తాగునీటికి కోదండాపురం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు 525, కోదండాపురం, స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ ప్లాంట్లకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటం వల్ల పీఏపల్లి మండలంలోని నక్కలపెంటతండా, దుబ్బతండాల సమీపంలోని వ్యవసాయ పొలాలకు కృష్ణమ్మ చేరువవుతోంది.