Komatireddy fire on KTR: తనను కోవర్ట్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోవర్టు అనే పదం వాడటానికి నీకున్న అర్హత ఏంటని.. ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. రాజకీయమంటే అప్పనంగా అధికారం అనుభవిస్తూ కోట్ల అవినీతి చేయటం కాదన్నారు. అమరుల ఆత్మలు ఘోషిస్తుంటే విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేయటం అసలే కాదన్నారు.
'నేషనల్ మీడియాను అడిగితే కోవర్టులెవరో తెలుస్తోంది': నీ భాష.. పద్ధతేంటని.. ఇంతకీ చదివింది అమెరికాలోనా.. గల్లీలోనా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నతమైన హోదాను గడ్డిపోచలా వదులుకున్నానని గుర్తు చేశారు. సాగరహారంలో తనను తాకిన రబ్బరు బుల్లెట్లను.. ఆనాడు తన వెంట నడిచిన లక్షలాది జనాలను అడగాలని రాష్ట్రంలో ఎవరు ప్రజానాయకులో.. ఎవరు కోట్లు వెనకేసుకున్న కోవర్టులో తెలుస్తుందన్నారు. దిల్లీ లిక్కర్ స్కాంలో నేషనల్ మీడియాను అడిగితే కోవర్టులెవరో తెలుస్తుందన్నారు.