Komati Reddy Audio Viral: మునుగోడు ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల అగ్రనేతలంతా నియోజవర్గంలో మోహరించారు. ఇంటింటికీ తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఆడియో లీక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో మునుగోడు నియోజక వర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసి రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మునుగోడు ఉపఎన్నిక వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు... కాంగ్రెస్ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. రాజగోపాల్‌రెడ్డి భాజపా నుంచే పోటీ చేస్తుండగా... వెంకట్‌రెడ్డి మాత్రం తాను పార్టీ మారేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ తరఫున మునుగోడులో ప్రచారం చేయనని ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నేతతో... వెంకట్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉపఎన్నికలో తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలని ఆ ఆడియోలో కోరారు.