Komatareddy Venkat Reddy: సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో నల్గొండలో ఎందుకు 20వేల ఇళ్లు కట్టేలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్గొండ పట్టణంలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో ఏడాదిలోగా పట్టణంలో 5 వేలు, గ్రామాల్లో 300ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించాలనీ డిమాండ్ చేశారు. దత్తత అనే మాటకు అర్ధం తేవాలంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలని అన్నారు. అభివృద్ధి అంటే వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం కాదని మండిపడ్డారు.
జనవరి నుంచి నల్గొండలో రెగ్యులర్గా పర్యటించనున్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రూ.378 కోట్లతో రీటెండర్ వేయించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించానని అన్నారు. సీటు వచ్చినా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదనీ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది 28 మంది విద్యార్థులకు ఆర్ధిక సాయం అందజేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ కార్యవర్గాన్ని తాజాగా ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే పీఏసీ, పీఈసీల్లో ప్రజా ప్రతినిధులకు చోటు కల్పించిన అధిష్ఠానం.. ఆ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆదివారం కోమటిరెడ్డిని ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్ కండువా ఉంది.. మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.