KCR Review on Munugode By Poll : అక్టోబర్‌లో మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్..! - మునుగోడు నేతలతో కేటీఆర్ భేటీ
13:09 September 20
KCR Review on Munugode By Poll : 'అక్టోబర్ మొదటి వారంలో ఉపఎన్నిక నోటిఫికేషన్..!'
KCR Review on Munugode By Poll : మునుగోడు ఉపఎన్నిక షెడ్యూలు అక్టోబరులో రావచ్చని, నవంబరులో ఎన్నిక జరగవచ్చని, తెరాస అందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని తెరాస పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కేసీఆర్ సమీక్షించారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.
ఉప ఎన్నికను ప్రోత్సహించిన భాజపా ఇప్పుడు భయపడుతోందన్న సీఎం కేసీఆర్ అన్నారు. అక్టోబరు మొదటివారంలో నోటిఫికేషన్ రావచ్చని, నవంబరులో ఎన్నిక జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నిక నేడో, రేపో అన్నట్లుగా తెరాస పనిచేయాలని, దళితబంధుపై ఊరూరా ప్రచారం చేయాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. మునుగోడులోనూ 500 మందిని ఎంపిక చేయాలని సీఎం సూచించారు. గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నామన్నారు. గిరిజన బంధునూ ప్రారంభించబోతున్నామన్నారు. వీటిపై గిరిజనుల ఇంటింటికీ తిరిగి గిరిజన బంధు గురించి వివరించాలన్నారు.
మునుగోడులోని నివాసం ఉంటున్న గిరిజనులను రోజుకో వెయ్యి మందిని హైదరాబాద్ తీసుకొచ్చి కొత్తగా నిర్మించిన ఆత్మగౌరవ భవనాలను చూపించాలని పార్టీ వర్గాలకు సూచించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా, నాయకులు వ్యక్తిగత రాగద్వేషాలు వదిలి తెరాస గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక చండూరులో సభ నిర్వహిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని సర్వేల్లో తెరాస ప్రథమ, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నాయన్నారు. భాజపాకు మూడో స్థానమే గతి అని సీఎం వాఖ్యానించారు.