కంగారూ మదర్ కేర్.. బరువు తక్కువున్నా బేఫికర్ శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలను నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉంచి బరువు పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏంటీ కంగారూ మదర్ కేర్..
'కంగారూ మదర్ కేర్- కేఎంసీ' విధానంలో పుట్టిన శిశువును తల్లి ఎదపై ఉంచి కడతారు. ఈ పద్ధతిలో పిల్లలు త్వరగా బరువు పెరగడం సహా ఆరోగ్యంగా ఉంటున్నారు. అసలు బతుకుతారో లేదో అనుకున్న వారు ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇళ్లకు చేరుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నవారు చెబుతున్నారు.
తొలిసారిగా నల్గొండలోనే..
రాష్ట్రంలోనే తొలిసారిగా 2012లో నల్గొండలో ఈ విధానాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు వేలకుపైగా నవజాత శిశువులు ఇక్కడ లబ్ధిపొందారు. కంగారూ మదర్ కేర్ విధానంలో ఇంక్యూబేటర్ పద్ధతిలో ఉన్నట్లుగానే బిడ్డ ఎదుగుదల వేగంగా ఉంటుందని ఆస్పత్రి నోడల్ అధికారి తెలిపారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలను కొన్నిరోజుల వరకు పెంచి ఆ తర్వాత డిశ్చార్జి చేసి ఇంటికి పంపిస్తున్నామని వెల్లడించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వారే పరిష్కరించుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
కంగారూ మదర్ కేర్ విధానంలో 90 శాతం సక్సెస్ రేటుతో.. దేశంలోనే నల్గొండ అగ్రస్థానంలో ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విజయవంతంగా పిల్లల్ని సంరక్షిస్తున్నామని.. మరిన్ని సౌకర్యాలు ఇక్కడ సమకూర్చితే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెబుతున్నారు.
ఇవీచూడండి:'కొవాగ్జిన్' టీకా సమర్థవంతం.. భద్రతకే ప్రాధాన్యం