తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాణం పోయినా... మా భూమిని వదులుకునేది లేదు' - శిఖం భూమి

అది చెరువు శిఖం భూమి... కానీ ఆ గ్రామస్థులకు అదే కడుపుకింత ముద్ద పెట్టే సాగు భూమి. 70 ఏళ్లుగా తమకు జీవనాధారంగా ఉన్న ఆ స్థలాన్ని హరితహారంలో భాగంగా రెవెన్యూ అధికారులు సామాజిక అటవీ అభివృద్ధి కోసం సర్వే చేపట్టింది. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదంటూ... పురుగుల మందుతో ఆందోళనకు దిగారు.

VILLAGERS PROTEST FOR THEIR AGRICULTURE LAND

By

Published : Sep 13, 2019, 2:58 PM IST

'ప్రాణం పోయినా... మా భూమిని వదులుకునేది లేదు'
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం గుంటుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జంగాల వారి గూడెం వద్ద సర్వే నెంబర్ 38లోని దాదాపు 113 ఎకరాలు చెరువు శిఖం భూమిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొంత స్థలం ప్రభుత్వ భవనాల కోసం కేటాయించగా... మిగిలిన భూములను జంగాల గూడెం వాసులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సామాజిక అడవులను అభివృద్ధి చేసే దిశగా రెవెన్యూ అధికారులు సర్వేకు వెళ్లారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని లాక్కుంటే తాము ఎలా బతకాలంటూ... పురుగులమందు డబ్బాలతో నిరసన చేసి... సర్వేను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసేదాకా భూముల్లోనుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు...

శిఖం భూమిని తమకు పట్టా చేసి ఇవ్వాలని పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఎకరాల భూమిని తలా కొంత సాగు చేసుకుంటూ బతుకీడుస్తున్నామన్నారు. తమ జీవనాధారాన్ని లాక్కుని అడువులు పెంచటం వల్ల తాము అన్యాయమైపోతామని గోడు వెళ్లబోసుకున్నారు.

నచ్చజెప్పుతున్న అధికారులు...

ప్రభుత్వ శిఖం భూములుగా గుర్తించి హరితహారం కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే తాము సర్వే చేస్తున్నట్లు చెబుతున్నారు. తమని అడ్డుకున్నంత మాత్రాన ఎలాంటి న్యాయం జరగదని గ్రామస్థులకు నచ్చజెప్పుతున్నారు.

ప్రాణాలకైనా తెగించి తమ భూములకోసం పోరాడతామని జంగాల గూడెం వాసులు ఉద్ఘాటిస్తున్నారు. సీఎం కేసీఆర్​తో సహా పలువురు నేతలు ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: బాలాపూర్​ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్​ లడ్డూ...!

ABOUT THE AUTHOR

...view details