తెలంగాణ

telangana

ETV Bharat / state

నాడు శిష్యులే ఆయన బలం.. నేడు వాళ్లే ప్రత్యర్థగణం - congress leader jana reddy

43 ఏళ్ల రాజకీయ జీవితం.. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా ఘనత.. తాజాగా పదకొండో దఫా బరిలోకి.. ఇదీ కుందూరు జానారెడ్డి రాజకీయానుభవం. నాగార్జునసాగర్​కు తిరుగులేని నేతగా మారిన జానా... ఎంతోమందికి ఆదర్శప్రాయుడు. జనతా, తెదేపా, కాంగ్రెస్ పార్టీల్లో సేవలందించిన ఆయన.. విలక్షణ శైలితో ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నారు. ఆ అభిమానమే ఆయనకు క్రమంగా.. శిష్యగణాన్ని తయారు చేసింది. కానీ వారంతా తలోదారి పట్టి... ప్రత్యర్థులుగా మారి ఇప్పుడాయన ఓట్లకే గండిపెట్టేలా ఉన్నారు.

jana reddy , jana reddy disciples
జానారెడ్డి, జానారెడ్డి శిష్యులు, నాగార్జునసాగర్

By

Published : Apr 2, 2021, 12:18 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉండగా... గతంలో ఆయన అనుచరులుగా పనిచేసినవారే ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. తెరాస, భాజపా తీర్థం పుచ్చుకున్న సదరు శిష్యగణం... ఏకంగా ఆయన ఓట్లకే గురిపెట్టింది. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం తెరాస, భాజపాల్లో ఉన్న కొంతమందికి... తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి జానారెడ్డితో సాన్నిహిత్యం ఉంది. అలాంటివారిలో నల్లమోతు భాస్కర్ రావు, చేకూరి హన్మంతరావు ముఖ్యులు. ఈ ఇద్దరు జానాకు... ఏళ్ల పాటు కుడి భుజంలా వ్యవహరించేవారు.

ఆ ఇద్దరు ఇప్పుడు తెరాస నేతలు

భాస్కర్ రావు ప్రస్తుతం మిర్యాలగూడ శాసనసభ్యుడు కాగా... హన్మంతరావు నిడమనూరు మాజీ ఎంపీపీ. ఈ ఇద్దరూ ఇప్పుడు తెరాస నేతలుగా... ఆయా ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భాస్కర్ రావు, హన్మంతరావు... జానాతోపాటు తెదేపాలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనతోనే కాంగ్రెస్​లో చేరి... ప్రధాన అనుచరులుగా ముద్రపడ్డారు. జానా హోంమంత్రిగా ఉన్న సమయంలో.. భాస్కర్ రావు, హన్మంతరావు కీలకంగా వ్యవహరించేవారన్న పేరుంది. 2016 జూన్ 2న భాస్కర్ రావు, 2019 ఎంపీ ఎన్నికల సమయంలో హన్మంతరావు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం వల్ల కాంగ్రెస్ సీనియర్ నేతకు కీలక అనుచరులు దూరమయ్యారు.

ఈయనా.. ఆయన సన్నిహితుడే..

తిరుమలగిరి(సాగర్) మండలానికి చెందిన ఎం.సి.కోటిరెడ్డి... ఆది నుంచి పెద్దాయనకు సన్నిహితుడే. జానారెడ్డి కాంగ్రెస్​లో చేరే సమయానికి... కోటిరెడ్డి ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. అప్పటిదాకా నిమ్మల రాములు వెంట ఉన్న కోటిరెడ్డి... జానా హస్తం పార్టీలో చేరినప్పట్నుంచి ఆయనతో కలిసిపోయారు. న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు... ఇప్పటి మంత్రి జగదీశ్ రెడ్డికి కోటిరెడ్డి సన్నిహితంగా ఉండేవారు. ఆ పరిచయంతోనే 2016లో కోటిరెడ్డి తెరాసలో చేరి... క్రమంగా మంత్రికి ముఖ్య అనుచరుడయ్యారు.

వాళ్లిద్దరూ ఆయన అనుచరులే..

త్రిపురారం మండలంలో మర్ల చంద్రారెడ్డి, ధన్ సింగ్ నాయక్... జానారెడ్డి ప్రధాన అనుచరులుగా ఉండేవారు. చంద్రారెడ్డి జానా చేరిన తర్వాత కాంగ్రెస్ జెండా కప్పుకుని... గత జడ్పీటీసీ ఎన్నికల సమయంలో తెరాసలో చేరి ఆ పార్టీ నుంచి తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇదే మండలానికి చెందిన ధన్ సింగ్ నాయక్ ... సీనియర్ నేతకు కుడి భుజంగా ఉండేవారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు త్రిపురారం ఎంపీపీగా... బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మొదట్నుంచీ కాంగ్రెస్ వాది కాగా... గిరిజనుల్లో పేరు, పలుకుబడి ఉన్నాయి. త్రిపురారం మండలంలోని గిరిజనుల ఓట్లు రాబట్టేది ధన్ సింగ్ నాయకే అన్న ముద్రను వేసుకున్నారు.

జానా ప్రియశిష్యుడు

పెద్దవూర మండలానికి చెందిన అబ్బిడి కృష్ణారెడ్డి... గుత్తేదారు. మొదట్లో తెరాస ఉద్యమకారుడైనా... తర్వాత కాలంలో కాంగ్రెస్​లో చేరారు. గుత్త పనులు చేసుకుంటూనే ఎన్నికల సమయంలో గురువుకు సహకరించేవారు. జానాకు ప్రియశిష్యుడిగా మెలిగిన కృష్ణారెడ్డి... ఎన్నికల సమయాల్లో కేడర్ మొత్తాన్ని పర్యవేక్షించేవారు. కృష్ణారెడ్డి పార్టీ మారడం ప్రతికూలమనే అంటారు అక్కడివారు.

భాజపా అభ్యర్థీ.. ఆయనకు దగ్గరివాడే

ప్రస్తుత భాజపా అభ్యర్థి డా.రవికుమార్ నాయక్ కూడా... మొన్నటివరకు జానాకు దగ్గరగా ఉన్నారు. నెల క్రితమే రవికుమార్ దంపతులు భాజపాలో చేరారు. అనతికాలంలోనే రవి... ఎమ్మెల్యే టికెట్ సాధించగలిగారు.

నేడు ప్రత్యర్థులై..

జానారెడ్డి ఎప్పుడు ఎన్నికల్లో తలపడ్డా ఆ బాధ్యతలన్నీ ఈ శిష్యగణమంతా చూసేది. ఎన్నికల వ్యవహారాలన్నీ వీరంతా పర్యవేక్షించడం వల్లే సీనియర్ నేత గెలుపు సులువయ్యేదని చెప్పుకుంటారు. కానీ ఈ నాయకులంతా తలోదారి పట్టడంతోనే... గత ఎన్నికలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తుంటారు. ఒకప్పటి శిష్యులే నేటి ప్రత్యర్థులై ప్రస్తుత ఉప ఎన్నికలో ఆయన ఓట్లకు గండిపెట్టేలా తయారయ్యారు.

ABOUT THE AUTHOR

...view details