Jagdish Reddy Countered Attack Kishan Reddy : తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లు తెలంగాణలో అభివృద్ధి లేదు అప్పులు పెరిగి ప్రభుత్వం మాఫియాల మారిందంటూ చేసిన విమర్శలపై రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం కీర్తిస్తుండగా ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఈర్శ్యతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. 25 సంవత్సరాలుగా బీజేపీ ఎలుబడి ఉన్న మీ నేత ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్, పదేళ్ల తెలంగాణ అభివృద్ధిని పోల్చి చూద్దామా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
డబుల్ ఇంజిన్ సర్కార్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గుజరాత్లో, వారి పాలిత రాష్ట్రాల్లో ఒరగపెట్టింది ఏమి లేదని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. అప్పుల గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధిని గమనించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి నాడు - నేడు ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మేం తెచ్చిన అప్పులతో ఇంటింటికి తాగునీళ్లు, రోడ్ల అభివృద్ధి, సాగునీటి సమస్యను పరిష్కరించామని వెల్లడించారు.
"గుజరాత్‌తో తెలంగాణను పోల్చుకుందామా. 25 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీ ఉంది.. అది కూడా మోదీ నాయకత్వంలో. మరి అక్కడ 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా. ఇంటింటికీ నీళ్లు ఉన్నాయా గుజరాత్లో.. అక్కడ రైతులకు రక్షణ ఉందా.. తెలంగాణలో ఇవి అన్ని ఉన్నాయని చూపిస్తారా మీరు. దేశం కోసం తెచ్చిన అప్పులను అంబానీ, అదానీలకు దారాదత్తం చేశారు కదా. తమకు కేంద్రం ఇచ్చిన అప్పులను ప్రజలకు ఇచ్చాము. మాఫియా ప్రభుత్వం మీది."- జగదీశ్‌రెడ్డి, రాష్ట్రమంత్రి