IT Raids at Jagadish Reddy PA House: మునుగోడు ఉపఎన్నిక తేదీ దగ్గర పడుతున్న తరుణంలో నల్గొండ పట్టణం తిరుమలనగర్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి నివాసంలో.. నిన్న రాత్రి ఐటీ శాఖ అధికారులు.. సోదాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో చేసిన ఈ తనిఖీల్లో.. నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాల సందర్భంగా స్థానిక పోలీసులతో పాటు మీడియాను ఎవరినీ ఇంట్లోకి రానివ్వలేదు. మంత్రి సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో కొందరు నేతలు అప్రమత్తమైనట్లు తెలిసింది. ఓడిపోతామనే భావనతోనే భాజపా నేతలు ఐటీ శాఖను రంగంలోకి దింపారని తెరాస నేతలు ఆరోపించారు.
మరోవైపు నిన్న హైదరాబాద్‌లోనూ ఐటీ సోదాలు జరిగాయి. నిన్న సాయంత్రం మొదలైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. సికింద్రాబాద్ మినర్వా కాంప్లెక్స్‌లోని కావేరి సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థల కార్యాలయాల్లో ఐటీ బృందాలు గంటల తరబడి సోదాలు చేశాయి. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, ఎలక్ర్టానిక్ ఉపకరణాలు, స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ సహా మరో మూడు చోట్ల కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సోదాల్లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగినా స్పష్టత రాలేదు. ఐటీ వర్గాలు అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.