తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపఎన్నిక వేళ భారీగా పట్టుబడుతున్న సొమ్ము.. ఆరా తీస్తున్న ఐటీ శాఖ - మునుగోడు ఎన్నిక పట్టుబడిన డబ్బుపై ఐటీ శాఖ దృష్టి

మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ముపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. పోలింగ్‌ దగ్గర పడే కొద్దీ డబ్బుల రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నియోజక వర్గాన్ని పూర్తిగా అష్ట దిగ్బంధనం చేసిన పోలీసులు.. రెవెన్యూ అధికారుల బృందాలు వాహన తనిఖీలను ముమ్మరం చేశాయి.

munugode bypoll
munugode bypoll

By

Published : Oct 19, 2022, 7:45 AM IST

మునుగోడు ఉపఎన్నికల వేళ పోలీసులు స్వాధీనం చేసుకున్నసొమ్ముపై ఐటీశాఖ ఆరా

రాష్ట్రంలో వచ్చే నెల 3న జరగనన్న మునుగోడు ఉప ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ నువ్వా.. నేనా అనే రీతిలో ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నియోజకవర్గంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. ఆ సోదాల్లో భారీగా డబ్బులు పట్టుబడుతున్నాయి. ఉప ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ డబ్బు పంపిణీ, రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. మరిన్ని బృందాలను ఏర్పాటు చేసి వాటిని నిలువరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పట్టుబడిన నగదుపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే రూ.పది లక్షలకు పైగా మొత్తం దొరికితే ఆ కేసులను నగదుతో పాటు ఆదాయపు పన్ను శాఖకు బదిలీ చేస్తారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దొరికిన సొమ్ముపై ఐటీశాఖ ఆరా తీస్తోంది. కేసులో ఉన్న వ్యక్తుల ఆర్థిక స్తోమత వారు చెప్పే మాటల్లో ఏ మేరకు వాస్తవముంది. తదితర వివరాలను నిందితుల దగ్గర నుంచి తెలుసుకోవడం సహా సాంకేతిక పరంగానూ ఆరా తీస్తోంది.

భూమి అమ్మగా వచ్చిందని.. ఇళ్లు అమ్మితే వచ్చిందనో.. వ్యాపారం చేయగా వచ్చిందనే సమాధానాలు ఎక్కువగా నిందితుల నుంచి వస్తుంటాయని.. అవి ఎంత వరకు వాస్తవమనేది నిగ్గు తేల్చుకునేందుకు ఆరా తీస్తున్నట్లు ఐటీశాఖ తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో డీడీగా పని చేస్తున్న అధికారిని నోడల్‌ అధికారిగా నియమించారు.

ఆయన పర్యవేక్షణలోనే పట్టుబడిన డబ్బు కేసులపై విచారణ జరుగుతుందని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగైదు కేసులే వచ్చాయని.. ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆదాయపన్ను శాఖ అంచనా వేస్తోంది.

ఇవీ చదవండి:కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదు: ఈటల రాజేందర్‌

'మునుగోడు'లో సహకరించండంటూ ఆ భాజపా నేతకు కేటీఆర్‌ ఫోన్

'కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు'

48 మందితో కాంగ్రెస్​ లిస్ట్ రిలీజ్​.. అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు!

ABOUT THE AUTHOR

...view details