ఉమ్మడి నల్గొండ జిల్లా పంచాయతీరాజ్ అధికారులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 60-40 శాతం నిష్పత్తిలో సీసీ రహదారులకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. 60 శాతం కూలీలకు పని కల్పించి, 40 శాతం మెటీరియల్ కంపోనెంట్ కింద పనులు చేపట్టాల్సి ఉంది. అధిక శాతం గ్రామాల్లో సామాజిక వర్గాల వారీగా కాలనీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో అయిదు కంటే ఎక్కువ వీధులున్నాయి.
చాలా వీధులు రాకపోకలకు అనువుగా లేవు. వర్షం పడితే బురదమయంగా మారతాయి. ఇలాంటి వాటిని సీసీ రహదారులుగా మార్చాల్సి ఉంది. పంచాయతీ తీర్మాణాలతో సర్పంచులు ఆయా పనులను చేపట్టాల్సి ఉంటుంది. పనులు పూర్తయ్యాక నిధులను వారి ఖాతాలో జమచేస్తారు. రహదారుల నిర్మాణ పనులు గత మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నిలిచిపోయిన పనులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 71 మండలాల్లో 1740 గ్రామ పంచాయతీల్లో మట్టి రహదారులను సీసీలుగా మార్చడానికి ప్రభుత్వం రూ.62.65 కోట్లు మంజూరు చేసింది. ఒక్కోదాని నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 25 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. పనులు పూర్తి చేసేందుకు గత మార్చి నెలతోనే గడువు ముగిసినప్పటికీ పూర్తికాని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.