munugode by election:మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో బరిలో ఉన్న చిన్న పార్టీలు, స్వతంత్రుల వల్ల ఎవరికి నష్టం అనే కోణంలో ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం.. ఇందులో చాలా మంది క్షేత్రస్థాయిలో సీరియస్‌గానే ప్రచారం చేస్తుండటంతో ఏ పార్టీ ఓట్లు చీల్చతారు? ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తారనే ఆందోళన ప్రధాన పార్టీల నాయకుల్లో కనబడుతోంది.
రాష్ట్రంలో గతంలో జరిగిన ఉపఎన్నికల కన్నా మునుగోడు పరిస్థితులు కొంత భిన్నంగా ఉండటం.. త్రిముఖ పోటీ నెలకొనడంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లతో పాటూ బీఎస్పీ, తెలంగాణ జనసమితి, సకల జనుల పార్టీ, రిపబ్లికన్ పార్టీ, సోషల్ జస్టీస్ పార్టీ, యుగతులసి, ప్రజావాణి, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తదితర పార్టీలు బరిలో ఉన్నాయి.
33 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో:ఈ పార్టీలు కాకుండా 33 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిప్పుడు ప్రధాన పార్టీల గెలుపోటముల్లో కీలకంగా మారారు. నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం తర్వాత దళితుల ఓటు బ్యాంకు సుమారు 35 వేల వరకు ఉంది. దీంతో బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. మూడు వారాలుగా విస్తృత ప్రచారం చేస్తూ దళితుల ఓట్లతో పాటూ పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థి సామాజిక వర్గమైన బీసీలపైనా దృష్టి పెట్టారు.
వీరితో పాటూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించామని చెప్పుకుంటూ తెలంగాణ జనసమితి సైతం మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాల ఓట్లును అభ్యరిస్తోంది. దీంతో వీరు ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పోనూ 12 మంది స్వతంత్రులు పోటీలో నిలిచారు.