Heavy Police Bandobast in Munugode: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రోజుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గ్రామాలను క్లస్టర్‌లుగా విభజించి వాటి పర్యవేక్షణ బాధ్యత ఎస్ఐ, ఆ స్థాయి అధికారులకు అప్పగించింది. నియోజకవర్గం నల్గొండ, యాదాద్రి జిల్లాల పరిధిలో ఉండగా, యాదాద్రి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంది. అయితే ఎన్నికల భద్రతా ఏర్పాట్లను నల్గొండ జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి పర్యవేక్షిస్తున్నారు.
నియోజకవర్గంలో సుమారు 170 గ్రామాలుండగా... ఒకట్రెండు గ్రామాలను ఒక క్లస్టర్‌లాగా ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 104 క్లస్టర్‌లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక ఎస్ఐతో పాటూ 30 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక, అత్యంత సున్నిత గ్రామాల్లో రాష్ట్ర పోలీసులతో పాటూ కేంద్ర బలగాలు భద్రతా విధులు నిర్వహించనున్నాయి. వీరు రెండు బృందాలుగా విడిపోయి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వీరికి ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో బస కల్పించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ప్రచారానికి వచ్చే వివిధ పార్టీల ముఖ్యులు, గామంలో చోటు చేసుకునే ఘర్షణలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు ఆ సంబంధిత క్లస్టర్‌కు చెందిన ఎస్సైతో పాటూ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది.