యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతరం గ్రామశివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోలార్ ప్లాంట్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా... ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బైకును ఢీకొన్న కారు... ఇద్దరు అక్కడికక్కడే మృతి - ప్రమాద వార్తలు
రైస్ మిల్లులో బియ్యం పట్టించేందుకు వెళ్లి తిరిగి వస్తున్న రైతుల ద్విచక్రవాహనాన్ని ఓ కారు ఢీకొంది. ప్రమాద సమయంలో బైక్ మీద ముగ్గురు వ్యక్తులుండగా... ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఇంకో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సుద్దాల గ్రామానికి చెందిన గడ్డమీది బాలయ్య అతని భార్య రాజమ్మతో కలిసి అనంతపురంలోని రైస్ మిల్లులో బియ్యం పట్టించేందుకు వెళ్లారు. సాయంత్రం సమయంలో కరెంట్ పోవటం వల్ల.... పీసరి సిద్దారెడ్డితో కలసి ద్విచక్రవాహనంపై సుద్దాలకు వెళ్తున్నారు. అనంతారంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తున్న కారు... ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో సిద్ధారెడ్డి(45), గడ్డమీది బాలయ్య(55) అక్కడికక్కడే మృతి చెందారని, రాజమ్మకు తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవటం వల్ల వివరాలు తెలవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనంలోని వ్యక్తులు కారును ఘటనా స్థలంలో వదిలి పరారైపోయినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.