father and son relationship family issues : వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం చూడకుండా నిర్లక్ష్యం చేస్తున్న కుమారుడి నుంచి ఇంటిని తల్లిదండ్రులకు అప్పగించారు నల్గొండ జిల్లా అధికారులు. దీనికి సంబంధించి మిర్యాలగూడ ఒకటో పట్టణ ఎస్సై అంతిరెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి బంటు నర్సయ్య, కమలమ్మ దంపతులకు కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శ్రీనివాస్ హైదరాబాద్‌లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే తన సోదరీమణుల వివాహాల సమయాల్లో ఆస్తి పంపకాల్లో తండ్రి నర్సయ్య తనకు అన్యాయం చేశాడనే కోపంతో తల్లిదండ్రుల బాగోగులు మరిచాడు శ్రీనివాస్. పైగా మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఇంటికి తాళం వేసుకుని వెళ్లాడు. దీంతో ఇంటి ముందు తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు వృద్ధ దంపతులు.
ఏం జరిగింది?
ఈ క్రమంలో తన కొడుకు పట్టించుకోవడం లేదని ఈ ఏడాది మే 18న నర్సయ్య మిర్యాలగూడ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, మంచిగా చూసుకోవాలని కొడుకు శ్రీనివాస్‌కు ఆర్డీవో సూచించారు. పట్టించుకోక పోగా సివిల్ కోర్టులో ఆస్తి పంపకాల వివాదం ఉందంటూ శ్రీనివాస్ కేసు దాఖలు చేశాడు. దీంతో ఆర్డీవో ఆదేశాలూ అమలు కావడం లేదని, తమకు ఇబ్బందిగా ఉందని ఆగస్టు 12న నర్సయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తల్లిదండ్రుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధ దంపతులకే ఆ ఇల్లు ఇవ్వాలని అదేనెల 26న ఆదేశాలు జారీ చేశారు. అయితే శ్రీనివాస్ సివిల్ కోర్టులో దాఖలు చేసిన దావా కారణంగా కలెక్టర్ ఆదేశాల అమలులో జాప్యం జరిగింది. వృద్ధుల ఇబ్బందుల దృష్ట్యా.. కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ అధికారులు శ్రీనివాస్‌ను పిలిపించి ఒకటో పట్టణ పోలీసుల సమక్షంలో బంటు నర్సయ్యకు మంగళవారం ఆ ఇంటిని అప్పగించారు.