HC on Grandparents love for children : తల్లిదండ్రుల్లో ఒకరు మృతి చెందినపుడు మరొకరితో ఉన్న పిల్లలకు అవ్వ, తాతల ప్రేమ, అనురాగం, ఆప్యాయత అవసరమని హైకోర్టు పేర్కొంది. పెద్దల మధ్య వివాదం నేపథ్యంలో పిల్లలను వారితో కలవకుండా చేయడం సరికాదని పేర్కొంది. పిల్లల సంక్షేమం అంటే ఆర్థిక శ్రేయస్సు మాత్రమే కాదని, దీనికి సంబంధించి భిన్న కోణాలను చూడాలంది.
కుమార్తె మరణించడంతో నల్గొండ జిల్లాలో అల్లుడి వద్ద ఉన్న తన మనవరాలిని చూడటానికి కింది కోర్టు నిరాకరించడంతో అమ్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టి కీలక తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి.. మనవరాలిని పిలిపించి మాట్లాడిన తరవాత పాప భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని అమ్మమ్మను కలవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.