ఎగువ నుంచి కృష్ణమ్మ ఉరకలేస్తూ... నాగార్జునసాగర్ జలాశయానికి పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి 42,378 క్యూసెక్కుల నీటి ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 560.04 అడుగులకు చేరుకుంది. మొత్తం సామర్ధ్యం 312.04 టీఎంసిలకుగానూ... 232.30 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్ నుంచి ఎడమ కాలువకు 6,800 క్యూ సెక్కులనీరు విడుదల చేసారు.
ఎగువన కురుస్తున్న వర్షాలు.. నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులు - సాగర్ జలాశాయానికి చేరుతున్న వరద నీరు
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. వారం రోజులపాటు ఇలాగే కొనసాగితే... జలాశయం నిండుకుండలా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రధాన విద్యుత్ఉత్పత్తి కేంద్రం నుంచి 12,678 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. జలాశయం నిండడానికి ఇంకా 30 అడుగులు మాత్రమే ఉంది. ఇదే ప్రవాహం వారం రోజులుపాటు కొనసాగితే జలాశయం నిండు కుండాల మారే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద తాకిడి ఉండడం వల్ల... ఈ ఏడాది ఆగస్టు మాసంలో జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఈ సారి వారం రోజుల ముందుగానే సాగు నీరు విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధమయ్యారు.