శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు ఇవాళ 4 గేట్లను ఎత్తారు. స్పిల్ వే ద్వారా 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి శ్రీశైలానికి 1.71 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 64,102 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
సాగర్ 10 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ జలాశయానికి(nagarjuna sagar project) భారీగా వరద వచ్చి చేరుతోంది. లక్షా 90 వేల 645 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 10 గేట్లు, కాల్వల ద్వారా లక్షా 81 వేల 423 క్యూసెక్కుల్ని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టానికి తోడు పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ చేస్తున్నారు. 590 అడుగుల గరిష్ఠ నీటి నిల్వకు గాను 590 అడుగుల మేర... 312.04 టీఎంసీల సామర్థ్యానికి గాను 312.04 టీఎంసీల మేర ప్రస్తుతం నిల్వ ఉంది. కుడి కాల్వకు 9 వేల 160... ఎడమ కాల్వకు 8 వేల 718.. ఎస్సెల్బీసీ ఏఎమ్మార్పీకి 2 వేల 4 వందలు... ఎల్ఎల్సీకి 4 వందల క్యూసెక్కులు వదులుతున్నారు.