తెలంగాణలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పారుతున్నాయి. నల్గొండ జిల్లా చండూర్, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీని వలన పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్ మండలంలోని చండూర్, బొడంగిపర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల చండూర్, మునుగోడుకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్ పురపాలికలోని అంగడిపేట వాగు.. ప్రధాన రహదారిపై ఉద్ధృతంగా రావడం వల్ల చండూర్, మర్రిగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్ మండలం శిర్దేపల్లి, గొల్లగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మొత్తానికి చండూర్‌కు రావాల్సిన అన్ని దారులు స్తంభించాయి.
దీంతో నల్గొండ వైపు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంది. మునుగోడు మండలంలోని కొరటికల్, మునుగోడు మండల కేంద్రంలోని మర్రివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి పంటలో నీళ్లు చేరి.. తెగుళ్ల బారిన పడే అవకాశం ఉందని రైతలు ఆందోళన చెందుతున్నారు.