SLBC PROJECT: శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు రూపకల్పన చేసిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం)లో ఏర్పడిన సాంకేతిక లోపాలు, విద్యుత్తు ఛార్జీల బకాయి తదితర అంశాల వల్ల గత నాలుగైదు నెలలుగా పనులు సాగడం లేదు.
ఇటీవలే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పనులు మొదలుపెట్టే సమయానికి ఇక్కడ పనిచేస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన దాదాపు 300మంది కార్మికులు సమ్మెకు దిగారు. గత 4నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 4 నుంచి ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.
పెరుగుతున్న అంచనా వ్యయం
నల్గొండ జిల్లాలోని 3.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 500 గ్రామాలకు పైగా తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో రూ.1,925 కోట్ల అంచనా వ్యయంతో 2007లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 15 ఏళ్లలో సుమారు రూ.2,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయగా..పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం సుమారు రూ.4 వేల కోట్లకు చేరినట్లు తెలిసింది.