యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ శివారులో చోటుచేసుకున్న బాలికల హత్యోదంతాలపై విచారణ జనవరి మూడో తేదీకి వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత విచారణ ప్రారంభించిన కోర్టు... మనీషా కేసులో 44 మంది, శ్రావణి కేసులో 28, కల్పన కేసులో 29, మొత్తంగా మూడు కేసుల్లో 101 మంది సాక్షులు ఉండగా... ఇవాళ కేవలం మనీషా కేసు ప్రక్రియ మాత్రమే పూర్తయింది.
వాంగ్మూలాలు చదివి వినిపించి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ సమీపంలోని స్థానికుల వాంగ్మూలాలతోపాటు... పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పేర్కొన్న సారాంశాల్ని శ్రీనివాస్ రెడ్డికి వినిపించారు. శరీర ఆనవాళ్లు లభ్యమైన బావులకు సంబంధించిన యజమానులు, శ్రీనివాస్ రెడ్డి లిఫ్టు మెకానిక్‌గా పనిచేసిన సమయంలో నమోదైన హత్య కేసుల వివరాల్ని తెలిపారు.
జనవరి మూడున కుటుంబ సభ్యులు...
సాక్షుల వాంగ్మూలాలు నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి చదివి వినిపించిన అనంతరం న్యాయమూర్తి ఎస్వి.వి.నాథ్ రెడ్డి... వాటిపై నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం తెలుసుకున్నారు. వాటిలో ఏ ఘటనలోనూ తనకు సంబంధం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని నిందితుడు విన్నవించుకున్నాడు. నీ తరఫున ఎవరైనా సాక్షులను తీసుకువస్తావా అని నిందితుడిని న్యాయమూర్తి ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులను తీసుకువస్తానని నిందితుడు తెలిపాడు. జనవరి 3న సాక్షులను తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. కల్పన, శ్రావణి కేసుల్లోని వాంగ్మూలాల ప్రక్రియ కొనసాగింపును అదేరోజుకు వాయిదా వేశారు.
భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో ఏప్రిల్‌లో వెలుగుచూసిన బాలికల వరుస హత్యలు యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు.... నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన దృష్ట్యా... నల్గొండ మొదటి అదనపు సెషన్స్ కోర్టు అనుబంధ పోక్సో చట్టం న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
హాజీపూర్ హత్యకేసు... విచారణ జనవరి 3కు వాయిదా ఇదీ చూడండి: సమత కేసు విచారణ రేపటికి వాయిదా