Gutha Sukender Reddy Latest Comments : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహా, ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పార్టీలన్నీ తెలంగాణను చుట్టేస్తున్నాయి. ప్రతిపక్షాలేమో అధికార పార్టీ వైఫల్యాలు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రజలలోకి వెళుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం తాము గడిచిన 9 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవల వెలువడిన కర్ణాటక ఫలితాలలో కాంగ్రెస్ సత్తా చాటడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులలో పుల్ జోష్ని నింపగా... బీజేపీ శ్రేణులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు బీజేపీకి బుద్ధిచెప్పాయని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌పైనా విమర్శలు గుప్పించారు.
బీజేపీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది : కర్ణాటక ఫలితాల తర్వాత కూడా విద్వేష రాజకీయాల్ని రెచ్చగొట‌్టే బీజేపీ ధోరణిలో మార్పు రాలేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని, ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందని పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటకలో ఫలితాలొచ్చి 4 రోజులైనా సీఎంను తేల్చలేక పోవడాన్ని చూస్తే... దేశంలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నాయకులు అయోమయ స్థితిలోనే ఉన్నారని గుత్తా అభిప్రాయపడ్డారు.