తెలంగాణ

telangana

ETV Bharat / state

Grain purchase issue: పెరగని మిల్లింగ్ సామర్థ్యం.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం - grain purchase issues in Nalgonda district

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు.. ధాన్యం అమ్ముకునేందుకు అరిగోస తప్పడం లేదు. ఉచిత కరెంటు, తగినంత నీటి సరఫరా ఉండి పంట చేతికొచ్చినా.. ఆ ధాన్యాన్ని మార్కెట్​లో విక్రయించేవరకు అవస్థలు పడుతూనే ఉన్నారు. ధాన్యం దిగుమతికి సరిపడా మిల్లింగ్​ సామర్థ్యం లేకపోవడంతో మిల్లుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.

Grain purchase issue
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యలు

By

Published : Nov 7, 2021, 7:15 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నరకం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో అమ్మకాలకోసం రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తూ అవస్థల పాలవుతున్నారు. రైస్‌మిల్లుల మిల్లింగ్‌ సామర్థ్యం పెరగకపోవడంతోనే కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద రైస్‌మిల్లులు ఉన్న ప్రాంతంగా మిర్యాలగూడ పేరుగాంచింది. ప్రస్తుతం ఇక్కడ 100 వరకు పెద్ద మిల్లులు ఉన్నాయి. వీటిలో 20 మిల్లులు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద ప్రభుత్వం అందజేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నాయి. మిగిలినవి రైతుల నుంచి నేరుగా సన్నాలను కొంటూ బియ్యంగా మార్చి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాయి.

దొడ్డుకు బదులుగా సన్నాలే

ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తుండటంతోపాటు నాలుగేళ్లుగా సాగర్‌ ఎడమ కాల్వకు సకాలంలో నీటిని విడుదల చేస్తోంది. ఫలితంగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నాల సాగు విస్తీర్ణం 3 లక్షల ఎకరాల నుంచి 4.5 లక్షల ఎకరాలకు చేరింది. నల్గొండ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో రైతులు ఆయకట్టేతర ప్రాంతాల్లోనూ దొడ్డురకాలకు బదులు సన్న రకం వరి ధాన్యం సాగు చేస్తున్నారు. సన్నాల సాగు విస్తీర్ణం పెరిగినా... ఆ మేరకు ఇక్కడి రైస్‌ మిల్లుల మిల్లింగ్‌ సామర్థ్యం పెరగలేదు. ప్రస్తుతం మిర్యాలగూడలోని మిల్లుల మిల్లింగ్‌ సామర్థ్యం రోజుకు సగటున 300 మెట్రిక్‌ టన్నులు. అయితే ఇక్కడికి నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి రోజుకు 750 మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వస్తోంది. దీంతో ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్లు మిల్లుల ముందు బారులు తీరుతున్నాయి. ఇక్కడ 50 వరకు చిన్నమిల్లులు ఉండగా.. ధాన్యం కొనుగోలుకు వాటి యజమానులు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం నాసిరకం ధాన్యం వస్తుందని, కొన్ని రోజుల తరవాత వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చన్న ధోరణిలో వారు ఉన్నారు.

100 మిల్లుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మిర్యాలగూడను మిల్లింగ్‌ జోన్‌గా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం వద్ద కొంత భూమిని సేకరించి టీఎస్‌ఐఐసీకి అప్పగించాలని నిర్ణయించారు. అక్కడ 5 నుంచి 10 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల 100 మిల్లుల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులనూ ఆహ్వానించారు. వీటి కోసం 110 దరఖాస్తులు వచ్చాయి. అయినా, ఏడాదిగా ఈ ప్రతిపాదనల్లో పురోగతి కనిపించడం లేదు. ప్రభుత్వం స్థలాన్ని సేకరించి ప్రోత్సహిస్తే మిల్లుల ఏర్పాటుకు తాము సిద్ధమే అని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు చెబుతున్నారు.

మొలకలొస్తున్నాయ్‌.. కొనుగోళ్లు ఎప్పుడు?

నల్గొండ జిల్లా తిప్పర్తి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఈ నెల 1న ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. దాదాపు నెల రోజుల నుంచే రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ కొనుగోళ్లు ప్రారంభించలేదు. గన్నీ బ్యాగులు రాలేదని, ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించాలో నిర్ణయించకపోవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలతో ఇక్కడ ఆరబోసిన ధాన్యానికి మొలకలు వస్తున్నాయి. ‘‘40 రోజుల క్రితం ఇక్కడకు ధాన్యం తీసుకొచ్చా. ఇప్పటివరకూ కొనుగోలు చేయలేదు. వర్షానికి సగం ధాన్యం మొలకలు వచ్చాయి’’ అని మాడుగులపల్లి మండలం చెర్వుపల్లికి చెందిన ఇటుకల ఇంద్రారెడ్డి అనే రైతు ‘ఈనాడు’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:TSRTC: త్వరలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం.. నేడు కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details