తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం - telangana varthalu

హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో తుది అంకానికి తెర లేవనుంది. ఉదయం 8గంటలకు రెండు నియోజకవర్గాల్లో.. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పది లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. భారీ బ్యాలెట్ పత్రాలు, జంబో బాక్సులతో.. పోలింగ్​కు రంగం సిద్ధమైంది.

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం
నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం

By

Published : Mar 14, 2021, 2:14 AM IST

Updated : Mar 14, 2021, 6:30 AM IST

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సర్వతా ఉత్కంఠ రేపుతోంది. రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 21 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ నియోజవర్గం నుంచి ఏకంగా 93 మంది... నల్గొండ-వరంగల్- ఖమ్మం నియోజకవర్గం నుంచి 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండు నియోజవర్గాల్లో కలిపి పది లక్షలకు పైగా ఓటర్లు ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 1530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో దినపత్రిక పరిమాణంలో ఉన్న బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పోలింగ్ కేంద్రానికి ఒకటి చొప్పున జంబో బ్యాలెట్ బాక్సులను.. ఒకటి లేదా రెండు పెద్ద బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. జంబో బ్యాలెట్ బాక్సులను పదిశాతం అదనంగా సిద్ధం చేశారు. ఓటర్లు తమ ఓటుహక్కును ప్రాధాన్యతా క్రమంలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన వయొలెట్ రంగు స్కెచ్ పెన్నును మాత్రమే వాడాల్సి ఉంటుంది.

భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య

2015 ఎన్నికలతో పోలిస్తే ఈ మారు రెండు నియోజకవర్గాల్లోనూ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్​లో 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్​లో వెయ్యి మంది ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బ్యాలెట్ బాక్సుల చొప్పున 1598 బ్యాలెట్ బాక్సులు అదనంగా 324 బాక్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. ఎన్నికలు పూర్తయ్యాక సరూర్ నగర్ స్టేడియంలో బ్యాలెట్​ బాక్సులను భద్రపరచనున్నారు. ఈ నెల 17న ఎల్బీ నగర్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా..

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కోసం.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓటింగ్ కోసం.. నియోజకవర్గ వ్యాప్తంగా 731 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 5 లక్షల 5 వేల 565 ఓటర్లుండగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా లక్షా 90 వేల 817 మంది ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టిన అధికారులు.. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం... బ్యాలెట్ పెట్టెలను.. నల్గొండలోని స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఓట‌రు గుర్తింపు కార్డు లేకున్నా..

ఓట‌రు గుర్తింపు కార్డు లేకున్నా ఏదేని 9 గుర్తింపు కార్డుల్లో ఒకదానితో ఓటు వేయొచ్చని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిటి కార్డ్‌, పాన్ కార్డు.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు జారీ చేసిన అధికార గుర్తింపు ప‌త్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ, డిప్లొమా ఒరిజనల్ సర్టిఫికేట్లు, దివ్యాంగులకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు చూపాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి

Last Updated : Mar 14, 2021, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details