తెలంగాణ

telangana

ETV Bharat / state

మహమ్మారి మాయ: మధ్యాహ్న భోజన యాతన.. ఎదిగే చిన్నారులపై ప్రభావం

కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ విద్యాసంవత్సరం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత విద్యాసంవత్సరంలో ఏప్రిల్‌ 23 వరకు నడవాల్సిన పాఠశాలలు మార్చి 22కే మూతపడ్డాయి. జూన్‌ 12న పునఃప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటికీ తెరుచుకోలేకపోవడం వల్ల పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పూటగడవక తీవ్ర ఇబ్బందులతోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2.29 లక్షల మంది చిన్నారులపై ఈ ప్రభావం అధికంగా పడుతుందని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. అంగన్‌వాడీల మాదిరిగా విద్యార్థుల ఇళ్లకు అందజేస్తే మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

govt school students suffering to mid day meals in nalgonda
మహమ్మారి మాయ: మధ్యాహ్న భోజన యాతన.. ఎదిగే చిన్నారులపై ప్రభావం

By

Published : Aug 8, 2020, 2:52 PM IST

  • ఎదిగే పిల్లలకు..

రెక్కాడితే గానీ డొక్కాడని పేదల పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్నం గుడ్డుతోపాటు కూరగాయలు, సన్నబియ్యంతో భోజనం చేసేవారు. కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడం వల్ల పోషకాహారం అందక చిన్నారులు అలమటిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రుల్లో అధిక శాతం సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ, రోజువారీ కూలీలే ఉంటారు. ఇలాంటి కుటుంబాలకు మధ్యాహ్న భోజనం పథకం ఆసరాగా ఉండేది. ప్రస్తుతం సదరు విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నా.. ఎదిగే పిల్లలకు పోషకాహారం ఎంతో అవసరం. తగిన మోతాదుతో ప్రోటీన్లు, విటమిన్లు కావాలి.

  • ఉపాధి కోల్పోయిన వంట కార్మికులు

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో 3,147 వంట ఏజెన్సీల్లో 4,947 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల వీరందరూ ఉపాధి కోల్పోయారు. పాఠశాల ఉంటేనే భోజనం తినే విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి డబ్బులు వచ్చేవి. ప్రస్తుతం పాఠశాలలు మూతపడటం వల్ల ఉపాధి కరవైంది. ఏడాదిలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. మూడొంతుల రోజులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లభిస్తుంది. 110 రోజులు విద్యార్థులకు ఉడకబెట్టిన గుడ్లు అందిస్తున్నారు. ప్రస్తుతం గుడ్లు అందట్లేదు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, ఇతర పోషకాలకు అనుగుణంగా ప్రభుత్వం మెనూ తయారుచేస్తోంది. ఇప్పుడు మెనూ అమలయ్యే అవకాశం లేకపోవటం వల్ల ఎదిగే పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

  • అంగన్‌వాడీ కేంద్రాల తరహాలో ఇస్తే మేలు

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, గర్భిణులకు ప్రస్తుతం బియ్యంతో పాటు ఇతర పోషక పదార్థాలను వారి ఇళ్లకే నేరుగా సరఫరా చేస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఇదే విధంగా మధ్యాహ్న భోజనానికి అవసరమమ్యే సరకులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యానిపుణులు, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాల వారీగా పాఠశాలలు విద్యార్థులు మధ్నాహ్న భోజనం వండే కార్మికులు
నల్గొండ 1430 1,05,448 2,629
సూర్యాపేట 1,031 75,850 1,020
యాదాద్రిభువనగిరి 712 48,128 1,298

మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వ వ్యయం ఇలా.. (ఒక్కో విద్యార్థికి)...

● ప్రాథమిక పాఠశాలల విద్యార్థికి రూ.4.48 (1 నుంచి 5వ తరగతి వరకు)

● ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థికి రూ.6.71 (6 నుంచి 10వ తరగతి వరకు)

● వారంలో మూడు రోజులు గుడ్డు ఇస్తారు. (ఒక్కో గుడ్డుకు రూ.2 చెల్లిస్తారు)

ప్రభుత్వం ప్రత్యేక భృతి కల్పించాలి

మూడున్నర నెలలుగా పాఠశాలలు లేకపోవడం వల్ల గతంలో చేసిన పనికి బిల్లులు ఇంత వరకు చెల్లించలేదు. ఉపాధి లేకపోవటం వల్ల బతుకు భారంగా మారిందని ఓ మధ్యాహ్న భోజన కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక భృతి ఇచ్చి ఆదుకోవాలి.

విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు

నూతన విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని నల్గొండ జిల్లా డీఈవో భిక్షపతి తెలిపారు. ఆదేశాలు వచ్చిన వెంటనే విద్యార్థులకు భోజనం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీచూడండి:కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details