Revanth Reddy on KCR: రైతులను ఆదుకునేలా చర్యలు ఏం తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు వరి వద్దని... ఆయన ఫాంహౌస్‌లో మాత్రం పండించుకున్నారని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉన్నా ఈ ప్రభుత్వానికి పట్టదని మండిపడ్డారు. మే 6న వరంగల్ సభ విజయంతం కోసం నాగార్జునసాగర్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గోనె బస్తాలు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. గోనె బస్తాలు కావాలంటే టెండర్ వేసినా ఎవరూ రావట్లేదని చెప్పారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్ ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రైతుల జీవితాలతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓటమిపాలవ్వాలని డబ్బు పంచారని ఆరోపించారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి నెల్లికల్ లిఫ్ట్‌ను ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పి ఇప్పటి వరకు పునాది రాయి కూడా వేయలేదని విమర్శించారు.
'7వేల ఐకేపీ కేంద్రాలు తెరవాల్సి ఉంటే 2,300లు మాత్రమే ప్రారంభించారు. 15కోట్ల గోనె బస్తాయి అవసరం ఉంటే 8 కోట్ల గోనె బస్తాలకు టెండర్లు పిలిస్తే... టెండర్ వేసేవాళ్లే దిక్కులేదు. అకాల వర్షానికి పంట తడిసిపోకుండా కప్పడానికి టార్పాలిన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.' - రేవంత్ రెడ్డి