Paddy Procurement in Telangana : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్-1 పరిధిలోని మిర్యాలగూడ, వేములపల్లి, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, చిల్కురు, త్రిపురారం, హాలియా, నిడమనూరు మండలాల్లోని దాదాపు 4 లక్షల ఎకరాల్లో ముందస్తుగా వరి సాగవుతుంది. యాసంగిలో మార్చి నెల మధ్యలోనే కోతలు మొదలవుతాయి. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ కాలువలు, బోర్లు, చెరువుల కింద సుమారుగా 1.5 లక్షల ఎకరాల్లో పంట ఇదే సమయంలో సాగవుతుంది. బోధన్, వర్ని, రుద్రూర్, చందూర్, మోస్రా, కోటగిరి మండలాల్లో పది రోజుల క్రితమే పంట కోతలు మొదలయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో పలుచోట్ల గత వారం రోజుల్లోనే క్వింటాకు రూ.150 నుంచి రూ.300 వరకు ధర తగ్గించేసిన దళారులు, అన్నదాతల అవసరాన్ని దోచుకుంటున్నారు. ప్రైవేటు కొనుగోళ్లపై యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతో దళారులకు కలిసివచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కోతలు మొదలైతే మరింతగా ధర తగ్గిస్తారేమో అనే ఆందోళనతో ఎక్కువ మంది అయినకాడికి అమ్ముకుంటున్నారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.
‘నూక’.. అందరినోటా అదే మాట :వాస్తవంగా యాసంగి పంటలో ఏప్రిల్ మూడో వారం తర్వాత కోతకు వచ్చే పంటకే నూక ఎక్కువగా వస్తుంది. ముందస్తుగా కోతలు జరిగే ధాన్యంలో నూక తక్కువగానే వస్తుంది. ఈ విషయం వ్యాపారులకు తెలుసు. అందుకే ముందుగా కోతలు జరిగే ప్రాంతాల్లోని ధాన్యాన్ని ఇంతకాలం మద్దతు ధరతోనే కొంటూ వచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నూక విషయం ప్రస్తుతం ప్రధానంగా చర్చలోకి వస్తుండటంతో ప్రస్తుతం దళారులు దీన్నో అవకాశంగా మలచుకున్నారు. ఇదే నెపంతో ధరలో కోత పెడుతూ వస్తున్నారు. ఉదాహరణకు మిర్యాలగూడలో మార్చి నెలాఖరులో క్వింటా రూ.1900 చొప్పున కొనుగోలు చేయగా, ప్రస్తుతం రూ.1600 కూడా ఇవ్వడం లేదు. నిజామాబాద్‌లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడికి మిర్యాలగూడ, హైదరాబాద్, పెద్దపల్లి ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనుగోళ్లకు వస్తుంటారు. ఏటా రూ.1,750 వరకు ధర ఇచ్చేవారు. ఈసారి మొదటి రెండు రోజులు రూ.రూ.1,550 ఇచ్చారని, బుధవారం రూ.1370కు తీసుకున్నారని, పైపెచ్చు క్వింటాకు అయిదు కిలోల తరుగు కూడా తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
ఖర్చు పెరిగింది.. ధర తగ్గింది : "ఎకరా వరి సాగుకు రూ.35 వేలు ఖర్చవుతోంది. పెరిగిన డీజిల్ ధరలతో కోత యంత్రాల అద్దెలు పెరిగాయి. మా గ్రామంలో రెండ్రోజుల క్రితం వరకు క్వింటాలు రూ.1550కి కొన్నారు. ఇప్పుడు రూ.1400 ఇస్తున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో ఇచ్చింది తీసుకోక తప్పడం లేదు."