తెలంగాణ

telangana

ETV Bharat / state

దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత - నల్గొండలో రైస్​ మిల్లర్ల ఆందోళనలు

ధాన్యం కొనుగోలు విషయంలో.. అధికారులు, మిల్లర్లు, రైతుల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. కొనాలని ఒకరు, కొనబోమని ఇంకొకరు, మద్దతు ధరకే తీసుకోవాలని మరొకరు... ఇలా మూడు వర్గాల మధ్య బెట్టు నడుస్తోంది. ఈ ఆటలో అన్నం పెట్టే అన్నదాతలే పావులుగా మారుతున్నారు.

దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత
దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత

By

Published : Nov 3, 2020, 9:22 PM IST

దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత

నల్గొండ జిల్లాలో చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లు ఆందోళనకు దారితీస్తున్నాయి. నాటకీయ పరిణామాలు నెలకొనడంతో రైతులు రహదారులపై పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు రోజుల నుంచి సన్నరకం ధాన్యం రాక మొదలైంది. అధికారిక కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను కొనాలన్న ఆదేశాలు లేకపోవడం వల్ల... వాహనాల్లో తెచ్చిన ధాన్యాన్ని మిల్లుల వద్ద నిలిపి యజమానులతో రైతులు సంప్రదింపులు జరిపారు. మద్దతు ధర ఏ-గ్రేడ్ రకానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 ఉన్నా.. ఆ స్థాయిలో చెల్లించే పరిస్థితి లేదని మిల్లర్ల తీరును బట్టి స్పష్టమైంది.

మిల్లుకు తాళం

అప్పటికే మాటు వేసిన అధికారులు.. ఇద్దరు రైతుల వద్ద తక్కువకు కొన్న బాలాజీ రైస్ మిల్లును సోమవారం రాత్రి సీజ్ చేశారు. ఇది వివాదానికి దారితీసింది. ఎలా సీజ్ చేస్తారంటూ మిల్లర్లంతా పరిశ్రమలకు తాళాలు వేసుకున్నారు.

రోడ్డెక్కిన రైతన్న

మిల్లులకు తాళాలు వేయడంతో పంటను అమ్ముకునేందుకు తెచ్చిన రైతులు... సోమవారం నుంచి నిద్రాహారాలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. అసహనానికి గురై సోమవారం రాత్రి మిర్యాలగూడలోని వెంకటాద్రిపాలెం, అవంతిపురం వద్ద బైఠాయించారు. అయినా కొనుగోళ్లు జరపలేదు. మంగళవారం ఉదయం వెంకటాద్రిపాలెంలోని మిల్లుల వద్ద వందలాది మంది రైతులు రోడ్డెక్కారు. అద్దంకి-నార్కట్ పల్లి రహదారి, వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద బైఠాయించారు. రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని శాంతించాలని సూచించడంతో రైతులు వెనక్కి తగ్గారు.

మిల్లుల యాజమాన్యూలతో చర్చలు

రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. నాణ్యమైన ధాన్యానికి పూర్తిగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. ఐదు జిల్లాల నుంచి భారీగా ధాన్యం వస్తోందని.. ఇప్పటి వరకు 3వేల ట్రాక్టర్లు మిల్లుల ముందు బారులు తీరాయని.. వాటిలో వర్షాలు, వరదల వల్ల 20 నుంచి 30శాతం నాణ్యత దెబ్బతిందని కలెక్టర్‌కు తెలిపారు.

మిర్యాలగూడదే కొంటాం...

అధికారులతో జరిపిన చర్చల్లోనూ ప్రతిష్ఠంభన నెలకొంది. మద్దతు ధర రూ.1,888 చెల్లించాలని అధికారులు చెబుతుండగా.. నాణ్యమైన పంటకు రూ.1,800 మాత్రమే చెల్లిస్తామని మిల్లర్లు అంటున్నారు. దీనికితోడు మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల నుంచి వచ్చేసరకు నాసిరకంగా ఉంటుందని మిల్లుల యజమానులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:అన్నదాతలను అవస్థలకు గురిచేస్తున్న సన్నరకం సాగు

ABOUT THE AUTHOR

...view details