ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ 132 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. కానీ చివరి భూములకు నీరందక సాగుదారులు అవస్థలు పడుతూనే ఉన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలిచిన అనంతరం జరిగిన విజయోత్సవ సభలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశ్రాంత ఇంజినీర్ల బృందం 3 రోజుల పాటు ఆయకట్టు పరిధిలో పర్యటించింది. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో అభిప్రాయాలు సేకరించింది. ముదిమాణిక్యం, వజీరాబాద్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ మేజర్ల కింద చివరి భూములకు నీరందాలంటే ఎత్తిపోతల కీలకమని భావిస్తోంది. అన్ని అంశాలు పరిశీలించిన ఇంజినీర్లు 5 ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలనే యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి
రాజవరం మేజర్ పరిధిలోని నెల్లికల్ వద్ద హాలియా వాగు కృష్ణానది కలిసే ప్రాంతంలో ఎత్తిపోతల నిర్మించాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. రాజవరం కింద 9 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, కాల్వ మొదటి భాగంలో ఉన్న 5 వేల ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఆ ప్రాంతంలో నీటి లభ్యత సైతం ఆశాజనకంగా ఉండటం వల్ల ఎత్తిపోతల నిర్మాణానికి ఆ బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఎత్తిపోతల వ్యయం రూ. 80 కోట్లు ఉండగా, ఇప్పుడది రూ. 120 కోట్లకు చేరుకోనుంది. వజీరాబాద్ ఎల్-8 కింద సైతం చివరి భూములకు నీరందడం లేదు. దీని పరిధిలో 32 వేల ఎకరాలుంటే, ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా నీరందట్లేదు. చివరి భూములకు మూసీ నది నుంచి ఎత్తిపోతల నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దీనిని పరిగణలోకి తీసుకున్న బృందం వంద కోట్లు ఖర్చయ్యే ఎత్తిపోతలపైనే దృష్టిసారించాలని భావించింది.