వివిధ ఆరోగ్య సమస్యలతో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు ఆహారం అందిస్తారు. కానీ వారి వెంట సాయంగా వెళ్లే.. కుటుంబ సభ్యులు మాత్రం బయటే తినాల్సిన పరిస్థితి. కొందరు ఆసుపత్రికి వచ్చేటప్పుడే భోజనం తీసుకొస్తారు. మరికొందరు బయట హోటళ్లో తింటారు.
కడుపు మాడ్చుకోవాల్సిందే..
ఆసుపత్రిలో రోగి వెంట ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో మాత్రం భోజన సదుపాయం లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి భోజనం తీసుకురాలేని పరిస్థితి.. మరోవైపు హోటళ్లో తినే స్థోమత లేక ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సిన దుస్థితి.
ఖైదీలే వంటవారు..
రోగుల వెంట వచ్చే సహాయకులు ఆకలితో అలమటించకుండా.. నల్గొండ జిల్లా జైల్ శాఖ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆసుపత్రికి వచ్చే వారికి పది రూపాయల్లోనే రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. ఈ భోజనాన్ని జిల్లా జైల్లో ఉన్న ఖైదీలే వండుతారు. వారే ఆస్పత్రికి తీసుకువచ్చి విక్రయిస్తారు. లాక్డౌన్ వల్ల కొంత కాలం ఆగిపోయిన ఈ సేవలు.. ఈనెల 8న తిరిగి ప్రారంభమయ్యాయి.
నా భార్య కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చాం. వారం రోజుల నుంచి ఆసుపత్రి వద్దే ఉంటున్నాను. మా దగ్గర డబ్బుల్లేకనే ప్రభుత్వాసుపత్రికి వచ్చాం. మా లాంటి పేదలు ప్రభుత్వాసుపత్రికి వచ్చినప్పుడు భోజనానికి చాలా ఇబ్బంది అవుతోంది. బయట తినాలంటే చాలా ఖర్చవుతోంది. బయట ఒక ప్లేట్ మీల్స్కే దాదాపు రూ.60 ఉంది. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో అందిస్తోన్న పది రూపాయల భోజనంతో మా సమస్య తీరింది. ఖర్చు తగ్గింది. భోజనం రుచికరంగా ఉంది. చాలా మంది డబ్బులేక ఒకపూట తిని మరో పూట కడుపు మార్చుకునేవాళ్లుంటారు. జైళ్ల శాఖ అందిస్తోన్న ఈ భోజనంతో ఇక రోగుల వెంట వచ్చిన వారెవరూ ఆకలితో అలమటించరు.