తెలంగాణ

telangana

ETV Bharat / state

'14 ఎకరాల భూమి ఉన్నా కల్యాణలక్ష్మి చెక్కు ఎలా వచ్చింది?' - తెలంగాణ వార్తలు

నల్గొండ జిల్లా తుంగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని లావుడితండాలో ఈరి అనే మహిళ అక్రమంగా కల్యాణలక్ష్మి చెక్కు పొందారని వచ్చిన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. ఆర్డీవో రోహిత్ సింగ్ ఆదేశాలతో తహసీల్దార్ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే పథకం ఎలా వర్తిస్తుందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

field level inquiry, kalyana lakshmi
కల్యాణలక్ష్మిపై ఆరా, క్షేత్రస్థాయి విచారణ

By

Published : Jun 27, 2021, 5:32 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామపంచాయతీ పరిధిలోని లావుడితండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆర్డీవో రోహిత్‌ సింగ్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ జి.గణేష్‌ శనివారం క్షేత్రస్థాయి విచారణ జరిపారు. అనర్హులకూ పథకం వర్తింపజేస్తున్న తీరుపై వివరాలు సేకరించారు. ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు.

గ్రామస్థుల ఫిర్యాదు

లావుడితండాకు చెందిన ఇందిరకు వివాహం కాగా... ఆమె తల్లి లావూరి ఈరి అర్హత లేకున్నా అక్రమంగా కల్యాణలక్ష్మి చెక్కును పొందారని ఆర్డీవో కార్యాలయంలో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఆమె పేరు మీద 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిబంధనలు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కల్యాణలక్ష్మి చెక్కును పొందారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.

నాపేరు లావూరి ఈరి. నా భర్త చనిపోయారు. నాకు నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మిర్యాలగూడ మండల పరిధిలో మాకు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నలుగురు ఆడ పిల్లలకి పసుపు కుంకుమలు కింద ఆరు ఎకరాలు, కుమారులకు మూడెకరాలు ఇచ్చాను. వ్యవసాయ భూమి మొత్తం నా పేరుమీదే ఉంది. వాళ్లకు ఇచ్చినా కానీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇటీవల మా కూతురు ఇందిర పెళ్లి చేశాం. తర్వాత కార్యాలయాల చుట్టూ తిరిగి మేం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. మాకు రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. మా కుటుంబానికి గతంలో రేషన్ కార్డు మంజూరైంది. కానీ భూమి ఎక్కువ ఉండడంతో అధికారులు దానిని రద్దు చేశారు.

-లావూరి ఈరి

అనుమానాలు

ఈరికి 14 ఎకరాల భూమి ఉందని... వేరే మండలంలోని వ్యవసాయ భూమిని గురించి అధికారులకు చెప్పడం లేదని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల స్పందన

ఈరి అత్తగారు రేషన్ కార్డులో మనుమరాలు ఇందిర పేరు ఉండటంతోనే కల్యాణలక్ష్మికి అర్హురాలిగా గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ తహసీల్దార్ విచారణలో ఏమి తేలనుందోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కల్యాణలక్ష్మిపై ఆరా

ఇదీ చదవండి:పెళ్లికి నో చెప్పిన ఆమెపై 'గంజాయి కేసు' కుట్ర

ABOUT THE AUTHOR

...view details