నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం నడికుడలో 2500 పైగా ఓటర్లు ఉన్నారు. గతేడాది జూన్ నుంచి గ్రామంలో విష జ్వరాల విజృంభణతో గ్రామస్థులు వణికిపోతున్నారు. బాధితులకు చికిత్స కోసం మండల వైద్య బృందం ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మళ్లీ ఇప్పడు కూడా గ్రామంలో దాదాపుగా అందరూ విష జ్వరాల బారిన పడ్డారు. దీంతో గ్రామస్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఓ వైపు కరోనా భయం, మరో వైపు విష జ్వరాలతో ఊరు అల్లాడిపోతుంది.
వ్యర్థాలతో కలవరం
నడికుడలో ఎక్కడి చెత్త అక్కడే.. గ్రామంలో పెరిగిన కంప చెట్లు, వీధుల్లో పారుతున్న మురుగు నీరు.. ఫలితంగా దోమల బెడద పెరిగి విష జ్వరాలు సోకుతున్నాయి. ఊరి నడిబొడ్డున నిరుపయోగంగా రెండు బావులు ఉన్నాయి. చికెన్ సెంటర్ల వ్యర్థాలు, వాడి పడేసిన సిరంజీలు, చెత్తా చెదారాలను ఆ బావుల్లో నింపుతున్నారు. వీధుల్లో ప్రత్యేకంగా మురుగునీరు వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలోని వ్యర్థపు నీరు వీధుల్లోకి పారుతోంది. ఫలితంగా గ్రామం నిండా దోమలు చెత్తాచెదారంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. పారిశుద్ధ్యం సహా దోమల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపించారు.
నడికుడతో పాటు మిర్యాలగూడ మండలంలోని జంకు తండా, మాలోతు తండాలో జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జంకుతండాలో రెండ్రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఓ బాలిక మృతిచెందగా.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరణించిన బాలిక ఇంట్లోనే ముగ్గురు బాధితులు ఉన్నారు. సుమారు 30మందికి పైగా జ్వరాలు రాగా... ఇందులో అధికంగా చిన్నారులు ఉన్నారు.