New Method Of Paddy Cultivation In Nalgonda District:పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటూ పర్యావరణ హితంగా మెట్ట పద్ధతిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతులు వరిలో వినూత్న సాగు పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ముగిసిన వానాకాలం సీజన్‌లో నల్గొండ జిల్లాలో 10 వేల ఎకరాల్లో వరిని ఆ పద్ధతిలో సాగు చేయగా.. సంప్రదాయ సాగుతో పోలిస్తే మంచి దిగుబడులు వచ్చాయని అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఖర్చు లేకపోవడం, ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం వల్ల ఎకరానికి తక్కువలో తక్కువగా 10 వేల నుంచి 2 వేల రూపాయల వరకు మిగులుతున్నాయని వెల్లడిస్తున్నారు.
శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలన: మెట్ట పద్ధతిలో వానాకాలం సీజన్‌లో తొలకరికి ముందేభూమి చదును చేసి ఆ తర్వాత విత్తనాలు వేసి, వరిని పండిస్తారు. యాసంగిలో డ్రమ్‌సీడర్ సాయంతో.. విత్తనాలు చల్లుతారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వాతావరణ విభాగం శాస్త్రవేత్తలతో పాటు ఇరి భాగస్వామ్యంతో ఇక్కడి రైతులు ఈ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతిలో నాటు వేసినప్పటి నుంచి కోతల వరకు రైతులకు.. రెడ్డీస్ ఫౌండేషన్, ఇరి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సంప్రదాయ సాగుకంటే ఈ విధానంలో ఎకరాకు సగటున ఐదు నుంచి ఏడు బస్తాల దిగుబడి ఎక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు.
భూమి సురక్షితంగా ఉంటుంది: ఎరువులు, నీటి వినియోగంతగ్గడంతో సహజంగానే పర్యావరణంతోపాటూ నీటి కాలుష్యం తగ్గుతోందని తద్వారా భూసారం కోల్పోకుండా ఉంటుందని రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. దిగుబడులు బాగా ఉండటం, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో ఈ పద్ధతిలో ఈ యాసంగిలో సాగు 50 వేల ఎకరాలకు పెరిగిందని చెప్పారు వచ్చే వానాకాలం సీజన్ నాటికి సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఈ పద్ధతిలో వరి సాగుచేసే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ పద్ధతిని పరిశీలించడానికి ఫిలిఫ్పిన్స్, ఇజ్రాయిల్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌కి చెందిన శాస్త్రవేత్తలు రెండునెలలక్రితం క్షేత్రస్థాయిలో పర్యటించారు. సాగులోని కష్టనష్టాలు రైతులను అడిగి తెలుసుకున్నారు.